Jagan: మీపై పూర్తి నమ్మకం ఉంది.. మీరు చెప్పినట్టే చేస్తాం: మోదీకి తెలిపిన జగన్
- సీఎంలతో ముగిసిన మోదీ వీడియో కాన్ఫరెన్స్
- కొన్ని షరతులతో లాక్ డౌన్ ను సడలించాలన్న జగన్
- రెడ్ జోన్లు కాని ప్రాంతాల్లో సడలించాలని విన్నపం
కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానికి సీఎంలు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగించడమే మంచిదని ప్రధానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ, మీ నాయకత్వ లక్షణాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. మీరు సూచించిన వ్యూహంతోనే ముందుకెళ్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పక్కా ప్రణాళికతో లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నామని జగన్ చెప్పారు. రాష్ట్రంలో 141 కంటైన్మెంట్ క్లస్టర్లను గుర్తించామని తెలిపారు.
ఇక లాక్ డౌన్ ను కొన్ని షరతులతో సడలించాలని సూచించారు. రెడ్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో లాక్ డౌన్ ను సడలించాలని అన్నారు. సినిమా హాల్స్, మాల్స్, స్కూళ్లు తప్ప... మిగిలిన వాటిని లాక్ డౌన్ నుంచి మినహాయించాలని చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వైద్యం అందిస్తున్నామని, దాదాపు 30 వేల మంది వైద్య సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపారు.