raghuram Rajan: ఐఎంఎఫ్ కీలక సలహాదారుల బృందంలో రఘురామ్ రాజన్!

IMF Appoints Rajan as Advisor

  • ఎక్స్ టర్నల్ అడ్వయిజరీ గ్రూప్ లోకి రాజన్ 
  • వెల్లడించిన చీఫ్ క్రిస్టలినా జార్జివా
  • ఆర్బీఐకి మూడేళ్లు గవర్నర్ గా వ్యవహరించిన రాజన్

పదకొండు మంది సభ్యులతో కూడిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కీలక సలహాదారుల బృందంలోకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ను తీసుకున్నట్టు ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలినా జార్జివా వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి, పలు దేశాల్లో జరుగుతున్న పాలసీ మార్పులపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఏర్పాటు చేసుకున్న ఎక్స్ టర్నల్ అడ్వయిజరీ గ్రూప్ లోకి రాజన్ ను ఆహ్వానించినట్టు క్రిస్టలినా వెల్లడించారు.

కాగా, ప్రస్తుతం 57 సంవత్సరాల వయసులో ఉన్న రఘురామ్ రాజన్, ఆర్బీఐ గవర్నర్ గా మూడేళ్లు సేవలందించి, సెప్టెంబర్ 2016లో తన పదవికి రాజీనామా చేసి, ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ చికాగోలో ప్రొఫెసర్ గా సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. "సభ్య దేశాలకు సరైన సమయంలో సలహాలు ఇవ్వాలంటే, తమకు నిపుణులైన వారి నుంచి సలహాలు, సూచనలు సమయానికి రావాల్సి వుంది. ఆ కారణంతోనే రాజన్ ను ఆహ్వానించాం" అని క్రిస్టలినా వ్యాఖ్యానించారు.

ఎంతో మంది ప్రముఖులు ఐఎంఎఫ్ ఎక్స్ టర్నల్ ఎడ్వయిజరీ గ్రూప్ సలహాదారులుగా ఉండటం గర్వకారణమని ఆమె వ్యాఖ్యానించారు. వారిచ్చే సలహాలతో ఎంతో అర్థవంతమైన చర్చలు సాగుతున్నాయని, తమ ఆలోచనలను సక్రమంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఐఎంఎఫ్ సలహాదారుల్లో థర్మాన్ షణ్ముగరత్నం, క్రిస్టిన్ ఫోర్బ్స్, కెవిన్ రూడ్, లార్డ్ మార్క్ మాలోచ్ బ్రౌన్ తదితరులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

raghuram Rajan
RBI
IMF
Advisor
  • Error fetching data: Network response was not ok

More Telugu News