America: అమెరికాలో అనాథ శవాలకు ఆ దీవే దిక్కు.. ఇప్పటి వరకు 10 లక్షల మృతదేహాల ఖననం!
- హార్ట్ దీవిలో భారీ గుంతలు
- అనాథ శవాల సామూహిక ఖననం
- రోజుకు సగటున 25 మృతదేహాల రాక
కోవిడ్-19 మహమ్మారి కారణంగా అమెరికా కకావికలు అవుతోంది. ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతంగా ఇక్కడ మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ మృతుల సంఖ్య 18 వేలు దాటింది. ఇది రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇక న్యూయార్క్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అమెరికా వ్యాప్తంగా నమోదవుతున్న మరణాలు, కేసుల్లో సగం ఇక్కడే నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైరస్ కారణంగా ప్రాణాలు విడిచిన వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అధికారులే సామూహిక ఖననాలు చేస్తున్నారు. అనాథ శవాలు, తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాని శవాలను పూడ్చిపెట్టేందుకు అధికారులు 150 ఏళ్లుగా ఉపయోగించుకుంటున్న హార్ట్ దీవినే ఇప్పుడు కరోనా మృతులకు కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ 10 లక్షల మందికిపైగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ దీవిలో భారీ గుంత తీసి అందులో ఖననాలు చేస్తున్నారు.
గతంలో సగటున వారానికి 25 మృతదేహాలను ఖననం చేసేవారు. ఇప్పుడు కరోనా ఆ సంఖ్యను కొన్ని రెట్లు పెంచేసింది. ప్రస్తుతం రోజుకు 25 మందిని ఖననం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మృతదేహాలు ఇంకా వచ్చే అవకాశం ఉండడంతో మరిన్ని భారీ గుంతలను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. కాగా, గత కొన్ని రోజులతో పోలిస్తే న్యూయార్క్‌లో కొత్త కేసుల నమోదు క్రమంగా తగ్గుతోందని గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. గురువారం 200 మాత్రమే ఆసుపత్రులకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని క్యూమో పేర్కొన్నారు.