Lisa Ray: పెళ్లి తర్వాత క్యాన్సర్ తిరగబెట్టిన విషయం భర్తకు చెప్పలేక సతమతమయ్యాను: లీసా రే 

Cancer Survivor Lisa Ray Reveals her low times
  • ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన లీసా రే
  • పెళ్లయిన నెలకే క్యాన్సర్ మళ్లీ వచ్చిందని వెల్లడి
  • నరకం చూశానన్న లీసా రే
మహేశ్ బాబుతో టక్కరిదొంగ చిత్రంలో నటించిన బాలీవుడ్ అందాలభామ లీసా రే క్యాన్సర్ బారినపడినా మొక్కవోని ధైర్యంతో పోరాడి ఆరోగ్యవంతురాలైంది. తాజాగా కరీనా కపూర్ నిర్వహించే వాట్ ఉమెన్ వాంట్ అనే టాక్ షోలో లీసా రే ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పెళ్లయిన నెలకే క్యాన్సర్ వ్యాధి తిరగబెట్టిందని, దాంతో నరకం చవిచూశానని తెలిపింది. జీవితంలో అత్యంత దుర్భర క్షణాలు ఏవని కరీనా కపూర్ అడగడంతో లీసా రే ఈ విషయం చెప్పింది.

"వాస్తవంగా చెప్పాలంటే నాకు క్యాన్సర్ తిరగబెట్టింది. దీని గురించి పెద్దగా ఎక్కడా చెప్పలేదు. ఇది సరిగ్గా పెళ్లయిన నెలకే జరిగింది. నిజంగా అదెంతో కష్టకాలం. ఈ విషయం నా భర్త జాసన్ డెహ్నీకి చెప్పలేకపోయాను. వైవాహిక జీవితంతో సంతోషంగా ముందుకెళదాం, ఆ తర్వాత క్యాన్సర్ సంగతి చూసుకోవచ్చని భావించాను. కానీ పెళ్లయి నెల తిరక్కముందే మళ్లీ ట్రీట్ మెంట్ కు వెళ్లాల్సి వచ్చింది" అని వెల్లడించింది.

భర్త గురించి చెబుతూ, "ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నాకు ఇంతటి అందమైన వ్యక్తి భర్త అయ్యాడు. అందుకే, నన్ను పెళ్లి చేసుకున్నందుకు థ్యాంక్స్ బేబీ అంటూ కృతజ్ఞతలు తెలిపాను. మళ్లీ ట్రీట్ మెంట్ కు వెళ్లాల్సి రావడంతో ఆహారంలో మార్పులు చేసుకుని పోషక విలువలున్న ఆహారం వైపు మొగ్గుచూపాను. మూడు నెలల పాటు డైట్ మార్చుకున్న తర్వాత ఎంతో ఉపశమనం కలిగింది" అంటూ వివరించింది. బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చిన సమయంలోనే లీసా రే క్యాన్సర్ తో పోరాడాల్సి వచ్చింది.  లీసా, జాసన్ డెహ్నీల వివాహం 2012లో జరిగింది. 2018లో వీరికి సూఫీ, సొలీల్ అనే కవలలు జన్మించారు.
Lisa Ray
Cancer
Bollywood
Tollywood
Kareena Kapoor

More Telugu News