Lockdown: మూడు కిలోమీటర్లు మించి వెళుతున్నారా?.. అయితే, మీరు పోలీసులకు దొరికిపోతారు!
- కొత్త యాప్ ద్వారా లాక్‌డౌన్ ఉల్లంఘనల గుర్తింపు
- హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పోలీసులు
- 3 కి.మి దాటితే జరిమానా, కేసుల నమోదు
మీరు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నారా? అయితే, మీ జేబుకు చిల్లు పడినట్టే. అంతేకాదు మీపై కేసులు కూడా నమోదుకానున్నాయి. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి రోడ్లపై తిరిగేవారిని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించిన వారిపై జరిమానాలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. దీనికోసం ‘ఆటోమేటిక్ పర్సన్ ఐడెంటిఫికేషన్ సిస్టం’ అనే ప్రత్యేక యాప్‌ను కూడా పోలీసు శాఖ రూపొందించింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల నుంచి ఈ యాప్‌ను వినియోగిస్తోంది.
నిత్యావసరాలు కొనుగోలు చేసే వారు సాయంత్రం ఏడు గంటల్లోపు ఇంటికి చేరుకోవాలని సూచించిన ప్రభుత్వం ఇందుకోసం ఇంటి నుంచి మూడు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాలని స్పష్టం చేసింది. కానీ, దీన్ని అలుసుగా తీసుకొని చాలా మంది రోడ్డెక్కుతున్నారు. మూడు కిలోమీటర్లకు మించి ప్రయాణిస్తున్నారు. పోలీసులు ప్రశ్నిస్తే.. నిత్యావసరాల కోసమే వచ్చామని, మూడు కి.మి. దాటలేదని చెబుతున్నారు. అయితే, ప్రత్యేక యాప్ సాయంతో అలాంటి వారిని పోలీసులు గుర్తిస్తున్నారు.
వాహనంతో రోడ్డుపైకి వచ్చిన వారు ఎంత దూరం వెళ్లారనే విషయం ఎప్పటికప్పుడు తెలుసుకొని, నిర్ణీత మూడు కిలోమీటర్లు దాటితే జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ఎవరైనా రోడ్డుపైకి వస్తే.. సమీపంలోని పోలీసులు ఆ వ్యక్తి వాహనం నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నంబరు యాప్‌లో నమోదు చేస్తారు. ఆ వ్యక్తి మరికొంత దూరం ప్రయాణించాక అక్కడున్న పోలీసులు కూడా ఇదే పని చేస్తారు. ఇలా పలు ప్రాంతాల్లో పోలీసులు వివరాలు నమోదు చేస్తారు. జీపీఎస్ ద్వారా పని చేసే ఈ యాప్‌లో ఒక వ్యక్తి ఎంత దూరం ప్రయాణించాడో తెలిసిపోతుంది. ఈ లెక్కన అతను మూడు కిలోమీటర్ల రూల్‌ను బ్రేక్ చేసినట్టు తేలితే కేసు నమోదు చేసి వాహనం స్వాధీనం చేసుకుంటారు.