Corona Virus: 38 శాతం వైరస్ కేసులు ఎక్కడా ప్రయాణించని వారే... మూడో దశ మొదలైనట్టేనా?

ICMR Corona Deta Shows Little Community Transmission

  • ప్రయాణ చరిత్ర లేని వారికి కూడా వైరస్
  • 2,500 వరకూ కేసులు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ వల్లే
  • మరిన్ని ర్యాండమ్ టెస్ట్ లు చేసేందుకు నిర్ణయం

ఇండియాలో కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ (సామాజిక సంక్రమణం) ప్రారంభమైపోయిందా? మూడో దశలోకి ఇండియా శరవేగంగా వెళుతోందా?.. కరోనాపై పోరాటంలో ప్రధానపాత్ర పోషిస్తున్న ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) తాజా గణాంకాలు అవుననే అంటున్నాయి. కరోనా పాజిటివ్ గా తేలిన వారిలో 38 శాతం కేసులు ఏ విధమైన ప్రయాణ చరిత్ర లేనివారేనని, ఎక్కడికీ ప్రయాణించని వారికి కూడా వైరస్ సోకుతోందని తమ రాండమ్ టెస్టుల్లో తేలుతోందని వెల్లడించింది.

ఇండియాలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6 వేలు దాటగా, సుమారు 2,500 వరకూ కేసులు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కారణంగానే వచ్చాయని ఐసీఎంఆర్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రెండు వారాల క్రితం ఇండియాలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ఇంకా ప్రారంభం కాలేదని అధికారికంగా ప్రకటించిన ఐసీఎంఆర్, ఇప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ పై మరింత స్పష్టమైన అభిప్రాయానికి వచ్చేందుకు మరిన్ని పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐసీఎంఆర్, ఎస్ఏఆర్ఐ (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్ నెస్) ఉన్న వారికి మరిన్ని రాండమ్ టెస్ట్ లు చేయాలని నిర్ణయించాయి.

ఇప్పటివరకూ ఇండియాలో కరోనా పాజిటివ్ వచ్చిన కేసుల్లో అత్యధికులు విదేశీ ప్రయాణాలు, ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరైన వారివే. దీంతో వీరందరినీ గుర్తించి, ఐసొలేషన్ చేయడం ద్వారా, వైరస్ వ్యాప్తిని సులువుగా అరికట్టవచ్చని కేంద్రం భావించింది. అయితే, వాస్తవాలు చూస్తే, పరిస్థితి దిగజారుతోందని చెబుతున్నాయి. వైరస్ ఎక్కడి నుంచి వస్తోందన్న విషయాన్ని గుర్తించకుంటే, కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంటుందని ఇప్పటికే ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలు నిరూపించాయి. ఇన్ఫెక్షన్ సోకిన వారి రేటు శరవేగంగా పెరుగుతూ ఉండి, ఎక్కడికీ ప్రయాణాలు చేయని వారికి కరోనా పాజిటివ్ వస్తుంటే, కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ మొదలైపోయినట్టే.

ఇదిలావుండగా, ఎస్ఏఆర్ఐ గత నెలలో నిర్వహించిన పరీక్షల ఫలితాలకు, ఇప్పుడు చేస్తున్న పరీక్షల ఫలితాలకూ ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. కరోనా లక్షణాలుగా చెప్పబడుతున్న జలుబు, దగ్గు, జ్వరం తదితరాలతో బాధపడుతున్న వారిలో 106 మందికి మార్చి 15 నుంచి 21 మధ్య పరీక్షించగా, కేవలం రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి. అదే మార్చి 22 నుంచి 28 మధ్య 2,877 మంది రక్త నమూనాలను పరీక్షించగా, 48 పాజిటివ్ కేసులు (1.7 శాతం) వచ్చాయి. ఆపై మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 మధ్య 2,069 మందిని పరీక్షించగా, 54 పాజిటివ్ కేసులు (2.6 శాతం) వచ్చాయి. వారం వారం కరోనా పాజిటివ్ వస్తున్న వారి శాతం పెరుగుతూ ఉండటం వైద్యాధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.

కరోనా లక్షణాలు కనిపించిన మొత్తం 5,911 మంది రక్త నమూనాల పరీక్షల తరువాత 104 మందికి పాజిటివ్ రాగా, అందులో 40 మందికి పైగా ఎటువంటి అంతర్జాతీయ ప్రయాణాలూ చేయలేదు. వీరంతా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 36 జిల్లాలకు చెందిన వారు కాగా, ఆయా జిల్లాలపై మరింత దృష్టిని సారించాలన్న ఆదేశాలు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్లాయి. ఇక కరోనా కేసుల్లో 80 శాతానికిపైగా కేసులు 40 ఏళ్లు దాటిన వారివేనని కూడా అధికారులు అంటున్నారు. వీరిలోనూ పురుషుల సంఖ్య అధికమని వెల్లడించారు.

  • Loading...

More Telugu News