IMF: ఇది అత్యంత దారుణమైన ఆర్థిక పతనం: ఐఎంఎఫ్
- ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనన్న ఐఎంఎఫ్ చీఫ్
- ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన అవసరమని వ్యాఖ్యలు
- ప్రపంచ దేశాల్లో అనిశ్చితి పెరిగిపోతోందని వెల్లడి
కరోనా మహమ్మారి చైనాతో పాటు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా కబళిస్తుండడాన్ని నిశితంగా పరిశీలిస్తున్న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ శతాబ్దంలో ఇదొక అత్యంత దుర్భరమైన ఆర్థిక పతనం అని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జియేవా అభివర్ణించారు. ఈ పెను సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థికవ్యవస్థ కోలుకోవాలంటే భారీ స్పందన అవసరం అని పేర్కొన్నారు. 2020లో ప్రపంచ ఆర్ధిక అభివృద్ధి ఒక్కసారిగా కుంటుపడిందని, ఐఎంఎఫ్ సభ్యదేశాల్లోని 170 దేశాల తలసరి సగటు బాగా తగ్గిపోయిందని వివరించారు.
"అప్పట్లో 'మహా పతనం' సంభవించిన తర్వాత మళ్లీ అత్యంత దారుణమైన ఆర్థిక క్షీణత ఇదే. ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. వచ్చే ఏడాదికి కాస్తంత ఉపశమనం వస్తుందేమో కానీ అది పాక్షికమే అవుతుంది. కరోనా విస్తరిస్తున్న తీరుతో ప్రపంచ దేశాల్లో తీవ్ర అనిశ్చితి పెరిగిపోతోంది" అని పేర్కొన్నారు.
1929 నుంచి 1939 మధ్య కాలంలో ప్రపంచ పారిశ్రామిక రంగం, ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోయాయి. 1929 అక్టోబరులో స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో మొదలైన ఈ ఉత్పాతం వాల్ స్ట్రీట్ ను కుదిపేసింది. లక్షల మంది పెట్టుబడిదారుల అదృష్టం గల్లంతైంది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపడంతో అదొక 'మహా పతనం'గా చరిత్రలో నిలిచిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు కరోనా మహమ్మారి కారణంగా నాటి మహా పతనాన్ని ఐఎంఎఫ్ చీఫ్ గుర్తుచేశారు.