Tirumala: తిరుమలలో శ్రీవారి ఏనుగులు ఇప్పుడు ఏం చేస్తున్నాయో తెలుసా?
- గజరాజులు బద్ధకించకుండా వాకింగ్
- రెండు కిలోమీటర్లు నడిపించిన మావటీలు
- ఆవులను కూడా బయటకు వదులుతున్న సిబ్బంది
ఊరికే తిని కూర్చుంటే శరీరం బద్ధకిస్తుంది. అది మనుషులకైనా, జంతువులకైనా. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో భాగంగా, తిరుమల కూడా భక్తుల దర్శనాలు లేక బోసిపోతోంది. ఈ సమయంలో శ్రీవారి నిత్య సేవల్లో తమవంతు పాత్రను పోషించే ఏనుగులు వాటి సంరక్షణ కేంద్రాలకే పరిమితం అయ్యాయి.
మామూలుగా అయితే, తిరుమలలో ఉదయం జరిగే సేవలకు, సాయంత్రం జరిగే సహస్ర దీపాలంకరణ సేవకు ముందు ఉత్సవ విగ్రహాల ముందు ఏనుగులు ఠీవీగా నడుచుకుంటూ వస్తాయి. మాడవీధుల్లో ఉన్న భక్తులను ఆశీర్వదిస్తుంటాయి. ఇక లాక్ డౌన్ కారణంగా ఇవి వాటివాటి కేంద్రాల్లోనే ఉండటంతో, వీటికి బద్ధకం రాకుండా చూసేందుకు మావటీలు వాకింగ్ చేయించారు. ఒకే చోట ఉంచితే, ఏనుగుల కాళ్లకు పుళ్లు పడే ప్రమాదం ఉంటుంది.
ఏనుగులు ఆరోగ్యంగా ఉండాలంటే నడక తప్పనిసరి అని చెబుతున్న మావటీలు, వాటిని తిరునామాలతో అలంకరించి, మూపురంపై నీలిరంగు వస్త్రం ధరింపజేసి, మాడ వీధుల్లో దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నడిపించారు. ఏనుగులను నిత్యమూ నడిపించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇక గోశాల లోని ఆవులను కూడా కాసేపు బయటకు వదులుతున్నామని, వాటి ఆరోగ్యంపైనా దృష్టిని సారించామని తెలిపారు.