Narendra Modi: లాక్ డౌన్ దశల వారీగానే ఎత్తివేత... ఎంపీలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ దృశ్యాలు లీక్!

Modi Video Conference With MPs Leaked

  • లాక్ డౌన్ ఒక్కసారిగా తొలగించబోము
  • సోషల్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు
  • వీడియోను టీఎంసీ లీక్ చేసిందంటూ వార్తలు 

ఇండియాలో లాక్ డౌన్ ను ఒకేసారిగా తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీ భావించడం లేదు. దశలవారీగా మాత్రమే లాక్ డౌన్ ను తొలగించాలన్న ఆలోచనలో ఉన్నారు. నిన్న పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వారందరి అభిప్రాయాలనూ కోరగా, ఆ సమావేశం వీడియో క్లిప్ ఒకటి లీక్ అయి, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్లిప్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుదీప్ బంధోపాధ్యాయ పాల్గొనగా, ఓ స్క్రీన్ పై ఆయన కనిపిస్తున్న వేళ, మరో స్క్రీన్ పై నుంచి మోదీ మాట్లాడుతున్నారు.

ఇందులోని వివరాల ప్రకారం, ప్రస్తుతం ఇండియాలో సోషల్ ఎమర్జెన్సీ తరహాలో అసాధారణ స్థితి నెలకొనివుందని వ్యాఖ్యానించిన మోదీ, కరోనాను గెలవాలంటే, సామాజిక దూరం పాటించడమే ఏకైక మార్గమని అన్నారు. లాక్ డౌన్ ను తొలగించే విషయమై మరోమారు ఆలోచించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు కోరుతున్నారని, తాను కూడా ఒకేమారు లాక్ డౌన్ ను తొలగించే ఆలోచన చేయడం లేదని మోదీ వ్యాఖ్యానించారు.

కరోనా కారణంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని వ్యాఖ్యానించిన ఆయన, దేశ ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఇక ఈ వీడియో వైరల్ అయిన తరువాత, లాక్ డౌన్ పొడిగింపు తప్పదని, ప్రజలు అందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఇదిలావుండగా, ఈ వీడియోను టీఎంసీ కావాలనే లీక్ చేసిందని వార్తలు వస్తున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News