Force majeure: కరోనా మరణాలకు 'ఫోర్స్ మెజ్యూర్' నిబంధన వర్తించదు: లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్
- దేశంలో పెరుగుతున్న కరోనా మరణాలు
- ఫోర్స్ మెజ్యూర్ నిబంధనతో క్లెయింలు నిరాకరించే అవకాశం
- ఇప్పుడా నిబంధన వర్తించదన్న కౌన్సిల్
దేశంలో కరోనా కారణంగా మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ స్పందించింది. కరోనా మరణాలను చూపుతూ బీమా పొందాలనుకునే వారి అభ్యర్థనలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థలకు స్పష్టం చేసింది. అంతేకాకుండా, కొవిడ్-19 కారణంగా మరణించిన వారికి 'ఫోర్స్ మెజ్యూర్' నిబంధన వర్తింప చేయరాదని పేర్కొంది. కరోనా మరణాలు-బీమా వర్తింపు అనే అంశంలో పాలసీదారుల్లో నెలకొన్న సందేహాలను తీర్చాల్సిన బాధ్యత ఆయా ఇన్సూరెన్స్ సంస్థలపై ఉందని కౌన్సిల్ తెలిపింది.
సాధారణంగా కొన్ని కంపెనీల బీమా పాలసీల్లో 'ఫోర్స్ మెజ్యూర్' అనే నిబంధన ఉంటుంది. ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, యుద్ధ తరహా పరిస్థితులు, మహమ్మారి అంటురోగాలు, కార్మికుల సమ్మెల ఘటనలను ఫోర్స్ మెజ్యూర్ గా భావిస్తారు. 'ఫోర్స్ మెజ్యూర్' (దైవిక ఘటన) నిబంధనను చూపుతూ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీదారుడికి క్లెయింను నిరాకరించే అవకాశం ఉంటుంది.
అయితే, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పాలసీదారులకు ఉపయుక్తంగా ఉండాలని, కరోనా మృతుల క్లెయింలను సత్వరమే పరిష్కరించాలని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ అన్ని బీమా కంపెనీలకు స్పష్టం చేసింది.