Corona Virus: 'కరోనా' నివారణ చర్యల సమన్వయానికి ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చాం: కేంద్రం

Centre to implement new system in corona coordination

  • క్వారంటైన్ పరిశీలనకు టెక్నాలజీ వినియోగం
  • తీవ్రతను అనుసరించి ప్రత్యేక ఆసుపత్రుల్లో చికిత్స
  • దేశంలో 4,421కి చేరిన కరోనా బాధితుల సంఖ్య

దేశంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా నివారణ చర్యల సమన్వయానికి కొత్తగా ఓ విధానం తీసుకువచ్చామని తెలిపారు.

కరోనా అనుమానిత లక్షణాలున్న వారిని తొలుత కొవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నామని వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితి తీవ్రతను అనుసరించి ప్రత్యేక ఆసుపత్రుల్లో చికిత్స అందజేస్తున్నామని వివరించారు. కరోనా చికిత్స కోసం ఆసుపత్రులను రెండు విధాలుగా విభజించామని, తీవ్ర, అత్యంత విషమంగా ఉన్న బాధితులకు వేర్వేరుగా చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి క్వారంటైన్ లో ఉన్న ప్రతి ఒక్కరినీ పర్యవేక్షిస్తున్నామని, కరోనా కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్ల సహా అన్ని వైద్య సదుపాయాలు కల్పించామని చెప్పారు.  ఇక, దేశంలో ఇప్పటివరకు 4,421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 326 మంది కోలుకోగా, 114 మరణాలు సంభవించాయి.

  • Loading...

More Telugu News