BJP: కరోనాను తరిమేస్తున్నానంటూ.. రాత్రి 9 గంటలకు పిస్టల్ పేల్చిన బీజేపీ మహిళ నేత... వీడియో ఇదిగో!

 BJP Leader Fires Shot in UP

  • నిన్న రాత్రి తుపాకి పేల్చిన మంజూ తివారీ
  • స్వయంగా వీడియో తీసి పోస్ట్ చేసిన భర్త
  • ఆయుధాల చట్టం కింద కేసు పెట్టిన పోలీసులు
  • ఉత్సాహంతో చేశానంటూ క్షమాపణలు చెప్పిన మంజు

ప్రధాని నరేంద్ర మోదీ మాట మేరకు నిన్న రాత్రి దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లలోని విద్యుత్ లైట్లను ఆర్పివేసి, దీపాలు వెలిగించి, కరోనా వైరస్ ను కలసికట్టుగా పారద్రోలాలన్న ఏకైక సంకల్పాన్ని, ప్రపంచమంతటికీ వినిపించిన వేళ, ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ మహిళా నేత మంజూ తివారీ, కాస్తంత విభిన్నంగా స్పందించి కష్టాలు కొనితెచ్చుకున్నారు. దీపాలు వెలిగించిన తరువాత ఫిస్టల్ తో గాల్లోకి కాల్పులను జరిపారు.

ఇక, గాల్లో కాల్పులు జరుపుతున్న వీడియోను చిత్రీకరించిన ఆమె భర్త, దాన్ని ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. "దీపాలు వెలిగించిన తరువాత, కరోనాను తరిమేస్తున్నాం" అని ఆయన ఆ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో మంజూ తివారీ క్షమాపణలు చెప్పారు.

"నిన్న నగరమంతా దీపాలు వెలిగించారు. అది ఓ దీపావళిలా అనిపించింది. ఉత్సాహంతో తుపాకీ కాల్చాను. నా తప్పును తెలుసుకున్నాను. క్షమాపణలు చెబుతున్నాను" అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం బీజేపీ బలరాంపూర్ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఆమె ఉన్నారు.

ఈ వీడియోను చూసిన పోలీసులు, ఆమెపై ఆయుధాల చట్టం కింద కేసు పెట్టారు. తుపాకీ పేల్చడంపై మండిపడిన యూపీ కాంగ్రెస్ విభాగం, బీజేపీ నేతలు చట్టాన్ని ఉల్లంఘించడంలో ఎల్లప్పుడూ ముందుంటారని, ఫేస్ బుక్ లో మంజూ తివారి పెట్టిన పోస్టుపై యోగి ఆదిత్యనాథ్ చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించింది.

  • Loading...

More Telugu News