Coimbattore: కరోనా నేపథ్యంలో వినూత్న రీతిలో వ్యాపారం... ప్రజల నిజాయితీ!
- లాక్ డౌన్ తో మూతపడిన వ్యాపారం
- కోయంబత్తూరులో సెల్ఫ్ సర్వీస్ వ్యాపారం
- సోషల్ మీడియాలో వైరల్
దేశవ్యాప్తంగా కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులో ఉండగా, నిత్యావసరాలు మినహా అన్ని రకాల వ్యాపారాలు మూతబడ్డాయి. ఈ సమయంలో ఓ స్వీట్ షాప్ యజమాని, ప్రజల మీద నమ్మకంతో, తాను తయారు చేసే బ్రెడ్ లను అమ్ముకునేందుకు వినూత్న రీతిలో వ్యాపారం చేస్తుండగా, ప్రజలు సైతం తమలోని నిజాయితీని చూపిస్తున్నారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరుగగా, ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
నగరంలోని రత్నపురం బ్రిడ్జ్ వద్ద మూసివేసివున్న ఓ స్వీట్ షాప్ ముందు టేబుల్ వేసిన యజమాని, దానిపై కొన్ని బ్రెడ్లు ఉంచి, దాని పక్కనే ఓ బోర్డు పెట్టించారు. ఇది సెల్ఫ్ సర్వీస్ అని, బ్రెడ్ ధర రూ. 30 అని, కావాల్సిన వారు తీసుకుని, తగిన మొత్తాన్ని పక్కనే ఉన్న డబ్బాలో వేయాలని దానిపై రాయించారు. ఇక, అక్కడికి వచ్చిన వారు తమకు అవసరమైన బ్రెడ్ తీసుకుని, సరిపడ్డా డబ్బును డబ్బాలో వేసి వెళుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రాలు, వీడియోలకు లైక్ ల మీద లైక్ లు వస్తున్నాయి.