Fishermen: మద్యం దొరకక ఆఫ్టర్ షేవ్ లోషన్ తాగి, ఇద్దరి మృతి!
- కరోనా ప్రభావంతో లాక్ డౌన్
- మూతపడిన మద్యం దుకాణాలు
- కూల్ డ్రింకులో కలుపుకుని తాగిన మత్స్యకారులు
కరోనా వ్యతిరేక పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా అన్నీ నిలిచిపోయాయి. మద్యం షాపులు కూడా మూసివేయడంతో మద్యపానానికి బానిసలైన వారి పరిస్థితి దుర్భరంగా మారింది. అందుకు ఈ ఘటనే నిదర్శనం. తమిళనాడులోని పుదుకోట్టయ్ జిల్లాలో ఇద్దరు మత్స్యకారులు మద్యం దొరక్క ఆఫ్టర్ షేవ్ లోషన్ తాగి ప్రాణాలు కోల్పోయారు. కొట్టాయ్ పట్టిణమ్ అనే గ్రామానికి చెందిన హసన్ మైదీన్, అన్వర్ రాజా, అరుణ్ కంటియన్ అనే జాలర్లు మద్యానికి బానిసలయ్యారు. లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్కపోవడంతో వారు షేవింగ్ తర్వాత ఉపయోగించే లోషన్ ను కూల్ డ్రింకులో కలుపుకుని తాగారు.
తాగడం పూర్తయ్యాక అన్వర్ రాజా తన ఇంటికి వెళ్లిపోయాడు. అయితే అక్కడే ఉన్న హసన్, అరుణ్ లు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వాంతులు చేసుకుంటూ, బాధ భరించలేకపోయారు. స్థానికులు వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మరోవైపు అన్వర్ పరిస్థితి కూడా శనివారం మధ్యాహ్నానికి క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉంది.