Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల్లో సగం ఆ మూడు జిల్లాల్లోనే!

 Half of the corona cases in Telangana are in those three districts

  • హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో విజృంభణ
  • తర్వాతి స్థానాల్లో వరంగల్ అర్బన్, కరీంనగర్
  • మొత్తం 20 జిల్లాలకు పాకిన వైరస్

తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 2వ తేదీ వరకు 154 కేసులు నమోదవగా అందులో సగం కేసులు (76) గ్రేటర్ పరిధిలోనే బయటపడ్డాయి. హైదరాబాద్‌ లో 50, రంగారెడ్డి లో 15, మేడ్చల్‌లో 11 కేసులు గుర్తించారు. ఈ మూడు జిల్లాల తర్వాత వరంగల్ అర్బన్ (18), కరీంనగర్ (17)లలో ఎక్కువ ప్రభావం ఉంది. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే ఇప్పటిదాకా 20 జిల్లాల్లో ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడిన రోగులను గుర్తించారు.

మొదట విదేశాల నుంచి వచ్చిన వారిలోనే వైరస్ లక్షణాలు కనిపించగా... కొన్ని రోజుల నుంచి స్థానికుల్లోనే ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారు. అయితే, వారంతా ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వాళ్లే కావడం గమనార్హం. 154 కేసుల్లో దాదాపు సగం మంది మర్కజ్‌ బాధితులే. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 75 మందికి పాజిటివ్ తేలింది. వారి ద్వారా కుటుంబ సభ్యులు, సన్నిహితులు మరో 33 మందికి వైరస్ సోకింది. మర్కజ్‌ కు వెళ్లొచ్చిన వారు, వారితో కాంటాక్ట్ అయిన వారితో కలిసి మొత్తంగా 108 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.

మత ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లొచ్చిన కుటుంబాల్లో వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఓల్డ్ సిటీ, కుత్బుల్లాపూర్, నాంపల్లికి చెందిన ఆరు కుటుంబాల్లోనూ నాలుగు కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News