America: మా వల్ల కాదు.. మృతదేహాలను ఆసుపత్రిలోనే ఉంచండి: న్యూయార్క్‌లోని శ్మశానవాటిక నిర్వాహకుల వేడుకోలు!
- అమెరికాలో దారుణంగా తయారైన పరిస్థితులు
- మృతదేహాల ఖననానికీ కష్టాలే
- గత 24 గంటల్లో వెయ్యి దాటిన మృతుల సంఖ్య
అమెరికాలోని న్యూయార్క్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. కోవిడ్ కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతుండడంతో మృతదేహాల ఖననానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న వారిలో నాలుగోవంతు మరణాలు అమెరికాలోనే నమోదవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో అమెరికాలో మరణించిన వారి సంఖ్య ఏకంగా 1400 దాటిపోవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అంతకంతకూ పెరుగుతున్న రోగులకు చికిత్స చేసేందుకు వైద్య సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇక, న్యూయార్క్‌లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. నగరంలో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటిపోగా, 3 వేల మందికిపైగా మృతి చెందారు. మరణాల సంఖ్య పెరుగుతుండడంతో శ్మశానవాటికల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. నిర్వాహకులపై ఒత్తిడి పెరుగుతోంది. ఒత్తిడి తట్టుకోలేక శ్మశానవాటిక నిర్వాహకులు చేతులు ఎత్తేస్తున్నారు. మృతదేహాలను కొంతకాలం పాటు ఆసుపత్రుల్లోనే ఉంచాలని మృతుల బంధువులను కోరుతున్నారు. బ్రూక్లిన్‌లోని శ్మశానవాటికలో ఒకేసారి 60 మృతదేహాలను ఖననం చేసే వీలుంది. అయితే, గురువారం ఉదయం ఒకేసారి 185 మృతదేహాలు రావడంతో ఏం చేయాలో తెలియక నిర్వాహకులు తలలుపట్టుకున్నారు. ఖననం చేసే వీలు లేకపోవడంతో మృతదేహాలపై లేపనాలు పూసి ఏసీల్లో భద్రపరిచినట్టు బ్రూక్లిన్ శ్మశానవాటిక నిర్వాహకులు తెలిపారు.