Team India: ధోనీ ‘విన్నింగ్ సిక్సర్​’ ప్రస్తావనపై గౌతమ్ గంభీర్ ఆగ్రహం!

Gautam Gambhir irked by obsession with MS Dhoni six

  • మొత్తం జట్టు వల్లే  2011  ప్రపంచకప్‌ సాధించామన్న మాజీ క్రికెటర్
  • ధోనీ సిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఆపాలని ఓ వెబ్‌సైట్‌కు  సూచన
  • భారత్ వరల్డ్‌కప్‌ నెగ్గి నేటికి తొమ్మిదేళ్లు

సొంత గడ్డపై  భారత క్రికెట్ జట్టు  వన్డే ప్రపంచకప్‌  కైవసం చేసుకొని గురువారంతో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. 2011 ఏప్రిల్ 2వ తేదీన మహేంద్ర సింగ్‌ ధోనీ నేతృత్వంలోని టీమిండియా 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి  కప్పు నెగ్గింది. నాడు వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో మన జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఈ మధుర జ్ఞాపకాన్ని క్రికెటర్లు, అభిమానులు నెమరు వేసుకున్నారు.  ‘క్రిక్‌ ఇన్ఫో’ వెబ్‌సైట్‌  కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేసింది. తన ట్విట్టర్ అకౌంట్లో ధోనీ  విన్నింగ్ సిక్సర్ ఫొటోను పోస్ట్ చేసింది. దానికి ‘2011లో ఇదే రోజు.. ఈ షాట్‌ కోట్లాది మంది ఇండియన్స్‌ను ఆనందంలో ముంచెత్తింది’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు కోపం తెప్పించింది.

2011  వరల్డ్‌ కప్ ఫైనల్లో భారత్ తరఫున టాప్‌ స్కోరర్ అయిన గంభీర్.. ప్రతి ఒక్కరి కృషి వల్లే జట్టు  విజేతగా నిలిచిందన్నాడు. ‘ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోకు నేను ఓ విషయం గుర్తు చేస్తున్నా. 2011 వరల్డ్‌కప్‌ను  యావత్ దేశం గెలిచింది. మొత్తం జట్టు, సహాయ సిబ్బంది వల్లే ఇది సాధ్యమైంది. మీరు ఇప్పటికైనా ఆ సిక్సర్ పై వ్యామోహాన్ని వదులుకుంటే  మంచిది’ అని ట్వీట్ చేశాడు. నాటి ఫైనల్లో 31 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును గంభీర్ అదుకున్నాడు. ధోనీతో కలిసి నాలుగో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయానికి చేరువ చేశాడు. అయితే 97 రన్స్ వద్ద గంభీర్ ఔటవగా.. చివరిదాకా క్రీజులో ఉన్న ధోనీ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. జట్టు విజయంలో గంభీర్ పాత్ర చాలా ఉన్నప్పటికీ, ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌ మాత్రమే హైలైట్ అయింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News