Aarogya Setu: కేంద్రం తీసుకువచ్చిన ఈ యాప్ కరోనా బాధితుడు మీ సమీపానికి వస్తే చెప్పేస్తుంది!
- కరోనాపై అధికారిక యాప్ తీసుకువచ్చిన కేంద్రం
- 'ఆరోగ్య సేతు' యాప్ కు రూపకల్పన చేసిన ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ
- ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్ లపై ఉచితం
దేశంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటివరకు 1,964 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 50 మంది మరణించారు. కాగా, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకువచ్చింది. దీనిపేరు 'ఆరోగ్య సేతు'. ప్రైవేటు భాగస్వామ్యంతో కేవలం 4 రోజుల్లోనే దీన్ని డిజైన్ చేశారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ బాధితుల వివరాలు ఇందులో ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తుంటారు.
ఇక దీని ప్రత్యేకత ఏంటంటే... ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే, ఒకవేళ మీకు సమీపంలోకి ఎవరైనా కరోనా బాధితుడు వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. తద్వారా కరోనా ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఎవరైనా ఒక వ్యక్తి అప్పటికే కరోనా పాజిటివ్ గా నమోదైన వ్యక్తితో కాంటాక్ట్ అయినట్టయితే, సదరు వ్యక్తి వివరాలను ప్రభుత్వానికి వెంటనే చేరుస్తుంది. ఫోన్ లొకేషన్ ను ఉపయోగించుకోవడం ద్వారా ఈ యాప్ తగిన సమాచారం అందిస్తుంది.
ఈ యాప్ లో యూజర్ డేటా కేవలం కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే పంచుకుంటారని, థర్డ్ పార్టీతో పంచుకోవడం ఉండదని, అందువల్ల ఇది సురక్షితం అని అధికారవర్గాలు చెబుతున్నాయి. 'ఆరోగ్య సేతు' యాప్ ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ఈ యాప్ లో కరోనా హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. వినియోగదారులు దీని ద్వారా ఆయా రాష్ట్రాల తాజా కరోనా సమాచారం ఎప్పటికప్పుడు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్ లపై ఉచితంగా లభించే ఈ ఆరోగ్య సేతు యాప్ 11 భాషల్లో సేవలు అందిస్తుంది.