COVID-19: దేశంలో 12 గంటల్లో 240 కరోనా కేసులు నమోదు: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
- దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,637
- ఇందులో 1,466 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
- కోలుకున్న 133 మంది
- ఏపీలో 43 కొత్త కరోనా కేసులు మర్కజ్ ప్రార్థనలవల్లే
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. గత 12 గంటల్లో దేశంలో 240 కొవిడ్-19 కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారిక ప్రకటన చేసింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,637కు చేరిందని తెలిపింది. ఇందులో 1,466 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 133 మంది కోలుకున్నారు. 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 87 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 43 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో పాల్గొని వచ్చిన వారే. అక్కడ జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న వారందరినీ పరీక్షించేందుకు అధికారులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు.