Corona Virus: కరోనాకు ప్రవేశం లేని చోటు అదొక్కటి మాత్రమే!
- 200కు పైగా దేశాలకు సోకిన మహమ్మారి
- స్పేస్ స్టేషన్ మాత్రం అత్యంత సురక్షితం
- వ్యోమగాములకు వైరస్ సోకే అవకాశం లేదంటున్న నిపుణులు
ప్రపంచంలోని 200కు పైగా దేశాల్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తూ, దాదాపు 8 లక్షల మందికి సోకింది. ఈ మహమ్మారి ప్రవేశించలేని చోటు అంటూ ఏదైనా ఒకటి ఉందా? అంటే... దానికి సమాధానం ఒక్కటే. అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఐఎస్ఎస్ లో పని చేసే వ్యోమగాములకు కరోనా వైరస్ సోకే అవకాశం లేదని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు.
"ఈ మహమ్మారి వ్యోమగాములకు సోకకుండా, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, క్వారంటైన్ విధానాలను అమలు చేస్తున్నాం. వారితో సమన్వయం చేసుకునే ప్రతి ఒక్కరి ఆరోగ్యంపైనా శ్రద్ధ చూపుతూ తగు చర్యలు తీసుకున్నాం. వ్యక్తిగతంగా సమాచార బట్వాడాను తగ్గించేశాము. మీడియాతోనూ ఎవరూ మాట్లాడటం లేదు. వ్యోమగాములతో నేరుగా సంబంధాన్ని కలిగుండే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించేశాము" అని ఇంటర్నేషనల్ ఎస్ఓఎస్ కు చెందిన నర్స్ బాట్స్ మనోవా వ్యాఖ్యానించారు. ఐఎస్ఎస్ లోకి కరోనా వైరస్ సహా ఏ విధమైన అంటువ్యాధి చేరకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని ఆమె అన్నారు.
రష్యన్ న్యూస్ ఏజన్సీ 'స్పుత్నిక్'కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, వ్యోమగాముల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఏ వ్యాధి కూడా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశం లేదని, ఆరోగ్య స్థిరత్వ కార్యక్రమం ఎన్నో ఏళ్లుగా అత్యుత్తమంగా కొనసాగుతోందని అన్నారు. సుమారు దశాబ్దకాలంగా నాసాతో సమన్వయం చేసుకుంటూ వ్యోమగాములకు ఆమె ఆరోగ్య సంబంధిత సేవలను అందిస్తున్నారు.
సాధారణ పరిస్థితుల్లో వ్యోమగాములు దీర్ఘకాలం పాటు క్వారంటైన్ లో ఉంటారని, అన్ని వైద్య పరీక్షల తరువాత మాత్రమే వారు ఐఎస్ఎస్ కు పంపబడతారని ఆమె తెలిపారు. అంతరిక్ష కేంద్రం స్వీయ వాతావరణాన్ని కలిగివుంటుందని, దీనికి అనుబంధంగా ఓ షట్ లూప్ పని చేస్తూ ఉంటుందని, ఈ కారణంతో ఏ విధమైన అంటువ్యాధులూ అక్కడికి ప్రవేశించలేవని ఆమె భరోసా ఇచ్చారు.
కాగా, రాత్రివేళ భూమిపై నుంచి దీనిని చూస్తే, వెలుగులీనుతున్న ఓ నక్షత్రంలా.. ప్రకాశవంతమైన విమానంలా కనిపిస్తూ, కదులుతూ ఉంటుంది. ఎటొచ్చీ విమానాలకు వుండేలా దీనికి ఏ విధమైన ఫ్లాషింగ్ లైట్స్ ఉండవు. ఓ సాధారణ విమానం (గంటకు 965 కిలోమీటర్ల వేగం)తో పోలిస్తే, స్పేస్ స్టేషన్ ఎన్నో రెట్ల వేగంతో (గంటకు 28 వేల కిలోమీటర్లు) ప్రయాణిస్తుందని అన్నారు.