spain: సంప్రదాయ అంత్యక్రియలపై స్పెయిన్‌లో నిషేధం!
- కరోనా దెబ్బకు అల్లాడుతున్న స్పెయిన్
- 87 వేల పాజిటివ్ కేసులు
- ఇప్పటికే 7800 మంది మృతి
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం గడగడలాడుతోంది.ఈ వైరస్ సోకి లక్షలాది మంది ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా స్పెయిన్‌లో ఈ వైరస్ ఉగ్రరూపం దాల్చింది. ఆ దేశంలో ఇప్పటికే 87 వేల పైచిలుకు మందికి వైరస్ సోకింది. దాదాపు 7800 మంది చనిపోయారు. మరో 5200 మంది రోగుల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆ దేశ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. తమ దేశంలో ఇప్పుడు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను జరపడాన్ని కూడా నిషేధించింది. ఎవరైనా చనిపోతే కుంటుబ సభ్యులు సహా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువ హాజరుకావద్దని ఆదేశించింది. అలాగే, అంత్యక్రియలకు ప్రజలెవరూ గుంపులుగా వెళ్లకూడదని చెప్పింది. ఆ దేశంలో ఏప్రిల్ 11 వరకూ లాక్‌డౌన్ కొనసాగనుంది.