Badam: ఊబకాయం నియంత్రణకు బాదం పప్పు ... లీడ్స్ వర్శిటీ పరిశోధనలో వెల్లడి!
- ఊబకాయంతో మధుమేహం, క్యాన్సర్ సమస్యలు
- బాదంపప్పు తినడం ద్వారా దుష్ప్రభావాలకు దూరం
- ఆకలి తగ్గి తక్కువగా తినవచ్చంటున్న పరిశోధకులు
ఊబకాయం సమస్య మధుమేహం, కేన్సర్ వంటి వ్యాధులకు కారణం అవుతుండగా, ఈ సమస్యను తగ్గించడానికి ఏ రకమైన ఆహారం ఉపయోగపడుతుందని లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేయగా, ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిశోధన తరువాత వెల్లడైన వివరాల ప్రకారం, ఊబకాయం నియంత్రణకు బాదం పప్పు ఉపయోగపడుతోందని తేలింది. ఉదయం తీసుకునే అల్పాహారంలో బాదం పప్పును చేర్చడం వల్ల ఆకలి ఫీలింగ్ తగ్గుతుందని ఈ అధ్యయనంలో తేలింది. స్నాక్స్ గా బాదం పప్పును తీసుకుంటే, డయాబెటీస్ రోగులలో స్పృహ తప్పడం వంటి లక్షణాలు కనిపించవని కూడా తేలింది.
ఇదే సమయంలో బాదంపప్పు తినేవారిలో అధిక మోతాదులో కొవ్వు ఉన్న పదార్థాలను తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది. స్నాక్స్ తిన్న తరువాత భోజనం చేస్తే క్యాలరీల శాతం గణనీయంగా తగ్గుతుందని లీడ్స్ అధ్యయనంలో పేర్కొంది. ఇతర ఆహార పదార్థాలతో పోల్చితే బాదం పప్పును ఆహారంగా తీసుకొన్నప్పుడు తక్షణ శక్తి లభిస్తోందని, ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన లీడ్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గ్రాహం ఫిన్ లేసన్ వ్యాఖ్యానించారు.
భోజనానికి భోజనానికి మధ్య కలిగే ఆకలిని తగ్గించడమే కాకుండా ఇతర అధిక శక్తిని ఇచ్చే ఆహార పదార్థాల వల్ల కలిగే దుష్పలితాలను బాదం పప్పు అరికడుతోందని తమ పరిశోధనలో వెల్లడైందని ఆయన తెలిపారు. ఈ పరిశోధనపై స్పందించిన న్యూట్రిషన్, ఫిట్ నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణమూర్తి. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల సంభవించే దుష్పరిణామాల నివారణకు బాదం పప్పు ప్రత్యమ్నాయమని తెలిపారు. బాదం పప్పు అనవసర ఆకలిని తగ్గిస్తోందని ఈ ఫలితాలను బట్టి తెలుస్తోందని పేర్కొన్నారు.