Corona Virus: కరోనా పంజా నుంచి తప్పించుకున్న యువతి... ఘన స్వాగతం పలుకుతున్న వీడియో!
- ఫిలిప్పీన్స్ కు వెళ్లి వచ్చిన యువతి
- కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స
- కోలుకుని ఇంటికి చేరుకున్న వైనం
కరోనా మహమ్మారి సోకి, ఆపై కోలుకున్న ఓ యువతి ఇంటికి రాగా, కుటుంబీకులు, మిత్రులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది. కరోనా పాజిటివ్ నుంచి నెగటివ్ గా మారిన 34 ఏళ్ల యువతి, కారు దిగి, తన వారు ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న భయంతో ఇంట్లోకి నడిచింది. ఆమె ఊహించని విధంగా కరతాళ ధ్వనులతో, శంఖాలు ఊదుతూ, డప్పు చప్పుళ్లతో ఆమెకు స్వాగతం పలికారు.
ఆపై ఆమె మాట్లాడుతూ, తాను 29 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉన్నానని, ఇంటికి వచ్చే ముందు ఎంతో ఆందోళన చెందానని వ్యాఖ్యానించింది. తనను చూసి అందరూ దూరం వెళతారని భావించానని, కానీ, తనవారు పలికిన స్వాగతాన్ని జీవితంలో మరువలేనని చెప్పింది. మార్చి ఫస్ట్ వీక్ లో ఫిన్ ల్యాండ్ కు విహారయాత్ర నిమిత్తం వెళ్లానని, ఆపై కరోనా ప్రబలుతుంటే ఇండియాకు వచ్చేశానని గుర్తు చేసుకున్న ఆమె, అందరికీ దూరంగా ఉన్నానని, కరోనా లక్షణాలు కనిపించగానే ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించానని వెల్లడించింది.
కరోనా పాజిటివ్ రావడంతో కుప్పకూలిపోయానని, ఈ వైరస్ కు మందులు కానీ, వ్యాక్సిన్లుగానీ లేవని తెలిసి బాధపడ్డానని తెలిపింది. తనకు చికిత్స చేసిన వైద్యులు, నర్సులు ఎంతో ధైర్యం చెప్పారని, వారిచ్చిన మనోధైర్యమే, తాను కోలుకునేందుకు ఉపకరించిందని వ్యాఖ్యానించింది.