Palaniswami: పవన్ కల్యాణ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన తమిళనాడు సీఎం
- చెన్నైలో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులు
- లాక్ డౌన్ కారణంగా అవస్థలు
- తమిళనాడు ప్రభుత్వం ఆదుకోవాలన్న పవన్
- సంబంధిత శాఖను ఆదేశించామన్న సీఎం పళనిస్వామి
దేశంలో ప్రతిచోట కరోనా లాక్ డౌన్ అమలు జరుగుతున్న తరుణంలో తమిళనాడులో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులను ఆదుకోవాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన విజ్ఞాపనను పవన్ కల్యాణ్ తమిళంలో ట్వీట్ చేశారు. పవన్ విజ్ఞప్తికి తమిళనాడు సీఎం పళనిస్వామి సానుకూలంగా స్పందించారు.
"ప్రియమైన పవన్ కల్యాణ్, మత్స్యకారుల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత శాఖను ఆదేశించాం. వారిని మేం తప్పకుండా ఆదుకుంటాం. కృతజ్ఞతలు!" అంటూ ట్విట్టర్ లో బదులిచ్చారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సీహెచ్ చొలగండి గ్రామానికి చెందిన 30 మంది మత్స్యకారులు చేపల వేట నిమిత్తం తమిళనాడు వరకు వెళ్లారు. అయితే లాక్ డౌన్ విధించడంతో వారు చెన్నై హార్బర్ లో నిలిచిపోయారు. వారికి భోజనం, వసతి లేక అలమటిస్తున్న విషయం వారి కుటుంబ సభ్యుల ద్వారా జనసేన నేతలకు తెలిసింది. వారు పవన్ కల్యాణ్ కు నివేదించడంతో ఆయన వెంటనే ట్విట్టర్ లో స్పందించారు.