Corona Virus: లాక్‌డౌన్ నిర్ణయంపై హర్భజన్ కీలక వ్యాఖ్య

Government should have thought about migrant labourers before lockdown announcement says Harbhajan Singh

  • ప్రకటించే ముందు వలస కూలీల గురించి ఆలోచించాల్సింది
  • వాళ్లకు ఇప్పుడు తిండి లేదు, పని లేదు
  • ఇప్పుడు నేను క్రికెట్ గురించి ఆలోచించను: హర్భజన్

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై భారత వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు ప్రభుత్వం వలస కూలీల గురించి ఆలోచించాల్సిందని అభిప్రాయపడ్డాడు. లాక్‌డౌన్‌ కారణంగా  వలస కూలీలకు తినడానికి తిండి, ఉండటానికి ఇళ్లు, చేయడానికి పని లేదని ఆందోళన వ్యక్తం చేశాడు.

వారికి ఆహారం, డబ్బులు అందించి ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. ‘ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. పౌరుల భద్రతకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఇంకా సమయం ఉందని భావిస్తున్నా’ అని భజ్జీ పేర్కొన్నాడు.

దేశం మొత్తం కరోనా వైరస్ తో భయపడుతున్న సమయంలో తాను క్రికెట్ గురించి ఆలోచించట్లేదని భజ్జీ చెప్పాడు. ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యతో పోల్చుకుంటే క్రికెట్ చాలా చిన్న విషయమని స్పష్టం చేశాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో క్రికెట్, ఐపీఎల్ గురించి ఆలోచిస్తే అది తన స్వార్థం అవుతుందన్నాడు.

ప్రస్తుతం అందరి ప్రాధాన్యత ఆరోగ్యంపైనే ఉండాలని హర్భజన్ చెప్పాడు. ప్రజలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటేనే క్రీడలు జరగాలన్నాడు. ‘మనమంతా ఏకమవ్వాల్సిన తరుణమిది. దేశం మళ్లీ దృఢంగా నిలబడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’ అని పిలుపునిచ్చాడు.

  • Loading...

More Telugu News