Ajinkya Rahane: కరోనాపై పోరాటానికి రహానే రూ.10 లక్షల విరాళం
- కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటానని వెల్లడి
- ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి
- ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ. కోటితో పాటు నెల జీతం ఇచ్చిన గంభీర్
కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు దేశం చేస్తున్న యుద్ధానికి క్రీడాకారులంతా తమ వంతు సహకారం అందిస్తున్నారు. సెల్ఫ్ క్వారంటైన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే.. ఆర్థిక సహకారం అందిస్తూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే కూడా తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. మహారాష్ట్ర ప్రభుత్వ సీఎం సహాయ నిధికి రూ.10 లక్షలు విరాళం ఇచ్చినట్టు వెల్లడించాడు. కరోనాపై చేస్తున్న పోరాటంలో తాను చేస్తున్న చిన్న సాయం ఇదని రహనే తెలిపాడు. ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తానని చెప్పాడు. ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని సూచించాడు.
ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.కోటి కేటాయించాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.కోటి రూపాయలు, తన ఒక నెల వేతనం విరాళంగా ఇచ్చినట్టు బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశారు.
కరోనాపై దేశం చేస్తున్న పోరాటానికి తనవంతు సహాయం అందించానని మహిళా క్రికెటర్ రిచా ఘోష్ తెలిపింది. బెంగాల్ సీఎం సహాయ నిధికి రూ.లక్ష విరాళం ఇచ్చానని చెప్పింది. బెంగాల్ క్రికెట్ సంఘానికి చెందిన 66 మంది కేబ్ అబ్జర్వర్లు రూ.1.50 లక్షలు, 82 స్కోరర్లు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రూ.50 లక్షలు, క్రికెటర్ సురేశ్ రైనా రూ.52 లక్షలు విరాళం అందించిన సంగతి తెలిసిందే.