China: వూహాన్ స్థానికుల అంచనా ప్రకారం... మృతులు 42 వేలు.. 'డైలీ మెయిల్' ప్రత్యేక కథనం!
- వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్
- మృతుల లెక్కపై సమగ్ర దర్యాఫ్తే లేదు
- రోజుకు 500 అస్తి కలశాలను పంచుతున్న అధికారులు
చైనాలోని వూహాన్, హుబేయ్ ప్రావిన్స్ లో పుట్టి, ప్రపంచమంతా వ్యాపించిన కరోనా వైరస్, ఇప్పటికే 7 లక్షల మందికి సోకి, అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 23 వేల మందిని బలిగొంది. వైరస్ వెలుగు చూసిన చైనాలో మృతుల సంఖ్య 3,300 అని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించగా, ఇక్కడి మరణాల సంఖ్య 42 వేలకు పైనే ఉండచ్చని వూహాన్ స్థానిక ప్రజలు నమ్ముతున్నారు. చైనా చెబుతున్న మృతుల్లో 3,182 మంది హుబేయ్ ప్రావిన్స్ కు చెందిన వారే.
ప్రముఖ మీడియా సంస్థ 'డైలీ మెయిల్' కధనం ప్రకారం, హుబేయ్ ప్రావిన్స్ లో 7 అంత్యక్రియల వేదికలు ఉండగా, మార్చ్ 25 అర్ధరాత్రి లాక్ అవుట్ నిబంధనలు తొలగించిన తరువాత ఒక్కో చోట నుంచి రోజుకు 500 ఆస్థి కలశాలను వారి బంధువులకు ఇస్తున్నారని, ఈ విధంగా రోజుకు 3,500 మంది మృతుల అస్థికలను ఉంచిన కలశాలను ప్రజలకు ఇస్తున్నారని, ఏప్రిల్ 5 న జరిగే మృతి చెందిన పెద్దలను పూజించే క్వింగ్ మింగ్ ఫెస్టివల్లోగా హకోవ్, వూచాంగ్, హన్యాంగ్ తదితర ప్రాంతాల్లోని వారికి కలశాలు అందుతాయని భావిస్తున్నారు.
హుబేయ్ ప్రావిన్స్ లో రెండు నెలల లాక్ డౌన్ అనంతరం దాదాపు 5 కోట్ల మంది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ప్రజా రవాణా సేవలు సైతం ప్రారంభమయ్యాయి. గ్రీన్ హెల్త్ సర్టిఫికెట్ (కరోనా నెగటివ్ అని ధ్రువపత్రం) వున్న వారిని 25వ తేదీ నుంచి రవాణా సౌకర్యాలను వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నారు. వూహాన్ మహా నగరం నుంచి బయటకు, బయటి వారు లోపలికి వెళ్లేందుకు మాత్రం అధికారులు ఇంకా అనుమతించడం లేదు.
కాగా, మృతుల సంఖ్య తక్కువ చేసి చెబుతున్నారని ప్రజలంతా నమ్ముతున్నా, అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయని వారే సరిపుచ్చుకుంటున్నారు. ప్రజలు వాస్తవాన్ని నమ్మడానికి కొంత కాలం పడుతుందని, అందుకే ఒక్కసారిగా మృతుల సంఖ్యను చెప్పడం లేదని వూహాన్ వాసులు కొందరు వ్యాఖ్యానించారు.
మృతుల లెక్కపై సమగ్ర దర్యాప్తే లేదని, లెక్కకు మించి జనం వారి ఇళ్లలోనే మరణించారని హుబేయ్ ప్రావిన్స్ అధికార వర్గాలు అంటున్నాయి. వీరెవరికీ అధికారికంగా కరోనా సోకినట్టు నిర్ధారించలేదన్న అభిప్రాయమూ నెలకొంది.