Bhadradri Kothagudem District: కొత్తగూడెం జిల్లాలో ఎంపీటీసీపై హత్యాయత్నం.. కారుతో ఢీకొట్టిన దుండగులు

Murder attack on kothagudem dist MPTC
  • ఇల్లెందు మండలం ఇందిరానగర్ ఎంపీటీసీని కారుతో ఢీకొట్టిన దుండగులు
  • గాయాలతో తప్పించుకున్న ఎంపీటీసీ
  • పరామర్శించిన ఎమ్మెల్యే బానుత్ హరిప్రియ
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఎంపీటీసీపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన నుంచి గాయాలతో తప్పించుకున్న బాధిత ఎంపీటీసీ అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు.

పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని ఇల్లెందు మండలం ఇందిరానగర్ ఎంపీటీసీ మండల రాము మహేశ్ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న సమయంలో వెనక నుంచి కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆయన బైక్‌ను ఢీకొట్టారు. దాంతో కిందపడి తీవ్రంగా గాయపడిన ఎంపీటీసీ భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. నేరుగా భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

అనంతరం ఆయనను ఇల్లెందులోని ఓ ఆసుపత్రికి తరలించారు. టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇల్లెందుకు చెందిన మహేశ్‌, ఖమ్మంకు చెందిన వెంకట్‌ సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. గాయపడిన ఎంపీటీసీని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ సహా పలువురు టీఆర్ఎస్ నేతలు పరామర్శించారు.
Bhadradri Kothagudem District
MPTC
Murder attack
Khammam District

More Telugu News