Nikhil: పర్సనల్ ప్రొటక్షన్ కిట్స్ అందజేసిన హీరో నిఖిల్
- ‘కరోనా’ నివారణకు పాటుపడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది
- వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది
- అందుకు కృతజ్ఞతగా ఈ కిట్స్ అందజేస్తున్నానన్న నిఖిల్
కరోనా వైరస్ నివారణకు పాటుపడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై ప్రముఖ యువహీరో నిఖిల్ ప్రశంసలు కురిపించారు.‘కరోనా’ మహమ్మారిపై పోరాడుతున్న వారు దాని నుంచి రక్షణ పొందేందుకు గాను భారీగా పర్సనల్ ప్రొటక్షన్ కిట్స్ ను నిఖిల్ అందించాడు.
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఉన్న హెల్త్ డిపార్టు మెంట్ అధికారులకు నిఖిల్ స్వయంగా అందజేశాడు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ, ‘కరోనా’ బారినపడ్డ వారికి నిత్యం వైద్య సేవలందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్భంది మనకు ఎంతో ముఖ్యమని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. వైద్యులతో పాటు పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, అధికారులు ఈ మహమ్మారిని లెక్క చేయకుండా కష్టపడుతున్నారని కొనియాడారు.
అందుకు, తన కృతజ్ఞతగా ఈ కిట్స్ అందజేస్తున్నానని చెప్పారు. ‘కరోనా’ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం, వైద్యులు చేసిన సూచనలను ప్రజలు పాటించాలని, లాక్ డౌన్ కు మనందరం సహకరించాలని కోరారు. కాగా, పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ కింద నిఖిల్ అందజేసిన వాటిలో రెండు వేల ఎన్-95 రెస్పిరేటర్లు, రీయూజబుల్ గ్లవ్స్, ఐ ప్రొటక్షన్ గ్లాసెస్, శానిటైజర్లు, పది వేల ఫేస్ మాస్క్ లు ఉన్నాయి.