Pakistan: డాక్టర్లు, అత్యాధునిక పరికరాలతో పాకిస్థాన్ కు చేరుకున్న చైనా ప్రత్యేక విమానం!
- పాక్ లో 1500 దాటిన బాధితులు
- వెంటిలేటర్లు ఔషధాలను పంపిన చైనా
- ఇతర ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన తరలింపు
తమకెంతో మిత్రదేశమైన పాకిస్థాన్ లో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటం, మృతుల సంఖ్య కూడా ప్రమాదకర స్థాయికి చేరడంతో చైనా రంగంలోకి దిగింది. తన అనుంగు మిత్ర దేశాన్ని ఆదుకునేందుకు కరోనాకు వైద్య చికిత్స చేయడంలో స్పెషలిస్టులను, అత్యాధునిక పరికరాలను పంపింది. చైనా నుంచి బయలుదేరిన ఈ ప్రత్యేక విమానం పాకిస్థాన్ కు ఈ ఉదయం చేరుకుంది.
ఈ విమానంలో వెంటిలేటర్లు, మాస్క్ లు, ఔషధాలు తదితరాలు చేరుకోగా, వీటిని వెంటనే ఇస్లామాబాద్, లాహోర్ తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు యుద్ధ ప్రాతిపదికన తరలిస్తున్నారు. కాగా, పాకిస్థాన్ లో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు 1500కు పైగా పెరిగాయి. మృతుల సంఖ్య 20 దాటింది. సమీప భవిష్యత్తులో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.