Corona Virus: కరోనా వుంటే కనుక ఐదు నిమిషాల్లోనే చెప్పేసే పరీక్ష రెడీ!
- కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసిన అమెరికా సంస్థ
- ఇప్పటికే ఎఫ్ డీఏ నుంచి అత్యవసర అనుమతి
- వారం రోజుల్లో అందుబాటులోకి
కరోనా వైరస్‌పై ప్రయోగాల్లో కీలక ముందడుగు పడింది. ఒక మనిషిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షకు ప్రస్తుతం ఒకటి రెండు రోజుల సమయం పడుతోంది. కానీ, ఈ పరీక్షను నిమిషాల్లోనే పూర్తి చేసేందుకు కొత్త టెక్నాలజీని కనుగొన్నారు. కరోనా ఉందో లేదో ఐదు నిమిషాల్లోనే తేల్చేసే ప్రక్రియను అమెరికాకు చెందిన ఓ సంస్థ అభివృద్ధి చేసింది.
అమెరికాకు చెందిన అబోట్ ల్యాబొరేటరిసీస్ అభివృద్ధి చేసిన ఈ విధానానికి అత్యవసర ప్రక్రియ కింద ఆ దేశ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) అనుమతి కూడా ఇచ్చింది. అయితే, తమకు పూర్తి స్థాయి అనుమతి రాలేదని సదరు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి గుర్తింపు పొందిన ల్యాబ్‌లో అత్యవసర ప్రాతిపదికన ఈ ప్రక్రియను ఉపయోగించడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పింది. వచ్చే వారం నుంచి దీన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.
ఈ ప్రక్రియలో కరోనా వైరస్ వుంటే కనుక ఫలితం ఐదు నిమిషాల్లోనే వస్తుందని తెలిపింది. నెగిటివ్ ఉంటే మాత్రం ఫలితం రావడానికి 13 నిమిషాల సమయం పడుతుందని చెప్పింది.