home: క్వారంటైన్ ముద్రతో బ్యాంకులోకి.. బ్రాంచ్ మూసేసి నిర్బంధంలోకి సిబ్బంది!
- హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలో ఘటన
- స్వీయ నిర్బంధంలోకి 18 మంది సిబ్బంది
- ఈ రోజు వరకు బ్రాంచ్‌ను మూసివేసిన అధికారులు
విదేశాల నుంచి వచ్చిన వాళ్లంతా కచ్చితంగా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చెప్పినా కొంత మంది పట్టించుకోవడం లేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో అలాంటి వాళ్లు బయట కనిపిస్తే కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కొందరు లెక్కచేయడం లేదు. అలాంటి వ్యక్తుల వల్ల ఇతరులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో చేతిపై హోం క్వారంటైన్ ముద్రతో ఉన్న ఓ వ్యక్తి మూడు రోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖకు వచ్చాడు. బ్యాంకు లావాదేవీల కోసం వచ్చిన ఆ వ్యక్తిని సిబ్బంది ప్రశ్నించగా.. అతనికి కరోనా లక్షణాలు ఉన్నట్టు వెల్లడైంది.
దీంతో బ్యాంకు సిబ్బంది మొత్తం నివ్వెరపోయారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు బ్యాంకులో పని చేస్తున్న 18 మంది సిబ్బంది 14 రోజుల స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆ బ్యాంకు శాఖను తాత్కాలికంగా మూసివేశారు. ఈ రోజు వరకు బ్రాంచ్‌ను మూసేస్తున్నట్టు బోర్డు పెట్టారు. బ్యాంకు పరిసరాలను పూర్తిగా శుద్ధి చేయాలని కూడా నిర్ణయించారు.