USA: ఇక మరణ మృదంగం అమెరికాలో... కరోనా కేసుల విషయంలో వరల్డ్ టాప్!
- యూఎస్ లో 83 వేలు దాటిన కేసులు
- 1,178 దాటిన మృతులు
- యుద్ధం చేస్తున్నామన్న డొనాల్డ్ ట్రంప్
కరోనా పాజిటివ్ కేసుల విషయంలో అమెరికా ఇప్పుడు ఇటలీ, చైనాలను అధిగమించింది. గత సంవత్సరం డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో తొలిసారిగా ఈ వైరస్ వెలుగులోకి రాగా, ప్రస్తుతం చైనాలో పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంది. ఆపై ఇటలీలో కేసుల సంఖ్య వందల నుంచి వేలకు పెరుగగా, ఇప్పుడా స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. అమెరికాలో గురువారం నాటికి 83 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా ప్రభావంతో అమెరికాలో నిరుద్యోగ రేటు భారీగా పెరిగిపోయింది. జీ-20 దేశాధి నేతలు 5 ట్రిలియన్ డాలర్లను ఆర్థిక సాయంగా అందించాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5 లక్షలకు చేరగా, 23,293 వేల మంది ఇప్పటివరకూ మరణించారు. అమెరికాలో మరణాల సంఖ్య 1,178కి చేరింది.
ఈ వైరస్ పై ఆర్థికంగా, సాంకేతికంగా, వైద్య పరంగా యుద్ధం చేస్తున్నామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.