National Highways: దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఫీజులు రద్దు... ఇళ్లకు వెళ్లిపోయిన సిబ్బంది!
- లాక్ డౌన్ నేపథ్యంలో ఆంక్షలు
- అత్యవసర వాహనాలు మాత్రమే రోడ్లపైకి
- రుసుము వసూలు చేయరాదన్న నేషనల్ హైవేస్
దేశవ్యాప్తంగా లాక్ డౌన్. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కాదుగదా... ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు కూడా వెళ్లలేని పరిస్థితి. ప్రజా రవాణా బంద్. కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అటూ ఇటూ తిరిగేందుకు అనుమతి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద ఫీజులు వసూలు చేయవద్దని, లాక్ డౌన్ అమలులో ఉన్నంతకాలం ఎలాంటి రుసుములు లేకుండా వాహనాలను వదిలేయాలని నేషనల్ హైవేస్ ఆదేశించింది.
ఇప్పటికే బీబీనగర్ సమీపంలోని గూడూరు టోల్ ప్లాజాకు ఈ ఆదేశాలు అందడంతో, నిన్న రాత్రి నుంచే వాహనాలను ఉచితంగా అటూ, ఇటూ తిరగనిస్తున్నారు. టోల్ బూత్ లలో పని చేసే సిబ్బందిని ఇళ్లకు పంపించి వేశారు.
కాగా, ఈ టోల్ ప్లాజా నుంచి 23న 10,650 వాహనాలు, 24న 3,880, 25న 1,650 వాహనాలు వెళ్లాయి. వాహనాల రాకపోకల సంఖ్య గణనీయంగా తగ్గడం, వచ్చి పోతున్న వాహనాలు, పోలీసులు, డాక్టర్లు, పాలు, నిత్యావసరాల వాహనాలే కావడంతో నేషనల్ హైవేస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.