Hyderabad: మార్కెట్లను తనిఖీ చేసిన మంత్రి తలసాని.. ధరల పెంపుపై ఆగ్రహం
- ఎర్రగడ్డ, యూసుఫ్‌గుడ ప్రాంతాల్లో పర్యటన
- పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరిక
- వసతి గృహాల నిర్వాహకులతోనూ సమావేశం
లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి షాపింగ్‌మాళ్లు, దుకాణాలు తనిఖీ చేశారు. ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఓ సూపర్ మార్కెట్‌లో సాధారణ ధర కంటే రూ.15లు అదనపు ధరకు వస్తువులు అమ్ముతుండడాన్ని గుర్తించారు.
దీంతో నిర్వాహకులను పిలిచి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకుంటే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. అనంతరం మంత్రి వసతి గృహాల నిర్వాహకులతోను సమావేశమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యార్థులను ఖాళీ చేయించవద్దని, వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను నిర్వాహకులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.