Corona Virus: కరోనా సోకిందని ఢిల్లీలో ‘ఈశాన్య’ రాష్ట్ర యువతికి వేధింపులు!
- ఆమెపై కిళ్లీని ఉమ్మిన ఆకతాయి
- కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన పోలీసులు
- ఈశాన్య ప్రాంత వాసులపై వేధింపులు అరికట్టాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో లాక్‌డౌన్ ప్రకటించి కఠిన చర్యలు తీసుకుంటోంది. అత్యవసరం లేనిదే ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచిస్తోంది. అయితే, ఈ సమయంలో కొంత మంది ఆకతాయిలు ఏ పనీ లేకున్నా రోడ్లపైకి రావడంతో పాటు విపరీత చేష్టలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఓ యువతికి కరోనా వచ్చిందంటూ ఎగతాళి చేస్తూ ఆమెపై కిళ్లీని ఉమ్మేసిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈశాన్య రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల యువతి ఢిల్లీలోని విజయ్‌నగర్ లో ఉంటోంది. సరుకులు కొనుగోలు చేసేందుకు తన స్నేహితుడితో కలిసి బయటికి రాగా..గౌరవ్ వోహ్రా అనే 40 ఏళ్ల వ్యక్తి ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెకు కరోనా వచ్చిందని, ఎవరూ దగ్గరికి వెళ్లొందంటూ అవమానించాడు. అంతటితో ఆగకుండా ఆమెపై పాన్ ఉమ్మేశాడు. దీనిపై సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన విజయ్ నగర్ పోలీసులు గౌరవ్‌ను అరెస్ట్ చేశారు. అతని స్కూటీని కూడా సీజ్ చేసినట్టు నార్త్ వెస్ట్ డీసీపీ ఆర్య తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను కరోనాతో ముడిపెడుతూ వారిని వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే లేఖ రాసింది.