Ramlalla: రామ జన్మభూమికి చేరిన రామ్ లల్లా... స్వయంగా తీసుకెళ్లి చేర్చిన యోగి ఆదిత్యనాథ్!
- మహత్తర కార్యానికి స్వయంగా శ్రీకారం
- రూ. 11 లక్షల విరాళం ఇచ్చిన యూపీ సీఎం
- అప్పటివరకూ విగ్రహాన్ని దగ్గర నుంచి చూడవచ్చన్న వీహెచ్పీ
హిందువులు దశాబ్దాలుగా కోరుకుంటున్న ఓ మహత్తర కార్యానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా శ్రీకారం చుట్టారు. ఒకవైపు కరోనా వ్యాప్తి భయాలు నెలకొని వున్నా, సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతున్నా, అయోధ్యలో రామ్ లల్లా విగ్రహాన్ని రామజన్మభూమి ప్రాంగణంలోకి తరలించారు.
ఈ కార్యక్రమాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన చేతుల మీదుగా స్వయంగా తరలించారు. రామ జన్మభూమి ప్రాంగణంలోని మానస భవన్ లోకి తన చేతులతో రాముని విగ్రహాన్ని ఆయన తరలించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం కోసం ఆయన రూ. 11 లక్షల చెక్ అందించారు. కాగా, రామాలయ నిర్మాణానికి భూమి పూజ తేదీని ఏప్రిల్ 2న ప్రకటిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ శ్రీరాముని విగ్రహాన్ని భక్తులు దగ్గరి నుంచి చూడవచ్చని వీహెచ్పీ నేత వినోద్ కుమార్ బన్సాల్ వ్యాఖ్యానించారు.