Telangana: నిత్యావసరాల ధరలు పెంచితే జైలుకే.. తెలంగాణ పౌర సరఫరాల శాఖ హెచ్చరిక
- లాక్‌డౌన్ సమయంలో ధరలు పెంచితే కేసు నమోదు
- తక్షణ చర్యలకు టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటు
- ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని వర్తకులకు సూచన
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది. అత్యవసర సేవలతోపాటు కిరాణా, మెడికల్ షాపులు తెరిచేందుకు మాత్రమే అనుమతించింది. ఇదే అదనుగా కొంతమంది వ్యాపారులు, వర్తకులు నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెంచేశారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో, లాక్‌డౌన్ ఉన్న కాలంలో నిత్యావసర సరుకుల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ ప్రకటన విడుదల చేసింది.
సరుకులను బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టు ప్రజలు ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకోవడానికి టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపింది. టోకు, చిల్లర వ్యాపారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే అని స్పష్టం చేసిన పౌరసరఫరాల శాఖ.. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని సరుకులను గరిష్టంగా ఎంతకు విక్రయించాలో జాబితా విడుదల చేసింది.