KCR: ఉన్నతాధికారులతో కేసీఆర్ అత్యవసర సమావేశం.. కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం!
- మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర స్థాయి అత్యున్నత సమావేశం
- తెలంగాణలో లాక్‌డౌన్ పరిస్థితిని సమీక్షించనున్న కేసీఆర్
- అనంతరం కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో వీడియో కాన్ఫరెన్స్
- సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరిగిపోతోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో రాష్ట్ర స్థాయి అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో లాక్‌డౌన్ పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి సీఎస్, డీజీపీలతో పాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు హాజరుకానున్నారు. ఇతర శాఖల ముఖ్య అధికారులూ హాజరవుతారు.
కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించి, సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశం అనంతరం కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. తాము తీసుకున్న నిర్ణయాలను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రకటిస్తారు.