IPL 2020: ఐపీఎల్ 2020 రద్దు... నేడో, రేపో బీసీసీఐ అధికారిక ప్రకటన!
- ఇప్పటికే ఏప్రిల్ 15 వరకూ వాయిదా
- దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్
- నిలిచిపోయిన విమాన సర్వీసులు
- ఐపీఎల్ ఓ అప్రధాన్యతాంశమన్న అధికారి
ఐపీఎల్ పోటీలపై తాము చర్చించి, ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేసిన నాటికి, నేటి పరిస్థితులకు ఎంతో మార్పు ఉందని, లీగ్ పై చర్చించడానికి ఇక ఏ సమావేశమూ జరపడం లేదని ఐపీఎల్ పాలకమండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ వ్యాఖ్యానించారు. ఓ రాష్ట్రం వారు పక్క రాష్ట్రం వారినే తమ ప్రాంతంలోకి రానివ్వని ఈ పరిస్థితుల్లో విదేశీయులు వచ్చే విమానాలను రానిస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
బ్రిజేశ్ పటేల్ వ్యాఖ్యలతో ఐపీఎల్ 13వ సీజన్ దాదాపుగా రద్దయినట్టేనని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తో పాటు, ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నేటి అర్ధరాత్రి నుంచి దేశవాళీ విమానాలు కూడా నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పోటీలు అప్రధాన్యమైన అంశమని ఓ ఫ్రాంచైజీ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా, నేడు బీసీసీఐ అధికారులు కొందరు సమావేశం జరపనుండగా, ఐపీఎల్ ను రద్దు చేస్తూ అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. అయితే, ఈ విషయాన్ని బీసీసీఐ పాలకవర్గాలు అనధికారికంగా స్పష్టం చేస్తున్నప్పటికీ, ఇప్పటికిప్పుడు కాకుండా, మరికొంత సమయం తీసుకుని రద్దు ప్రకటన చేసే అవకాశాలున్నాయని మరో అధికారి వెల్లడించారు. పలు ఫ్రాంచైజీల తరుఫున బరిలోకి దిగే నిమిత్తం జట్టు సభ్యులతో చేరిన విదేశీ ఆటగాళ్లు ఈ నెలారంభంలోనే తిరుగు ప్రయాణమైన సంగతి తెలిసిందే.