Hyderabad: ఆదివారం విద్యుత్ వినియోగం అరవై శాతమే: హైదరాబాద్ లో గణనీయంగా తగ్గిన డిమాండ్
- జనతా కర్ఫ్యూతో ఇళ్లకే పరిమితమైన జనం
- కార్యాలయాలు, కంపెనీలు షట్ డౌన్
- మూతపడిన హోటళ్లు...ఇతర ప్రజావసరాలు
జనతా కర్ఫ్యూ కారణంగా హైదరాబాద్ నగరంలో నిన్న విద్యుత్ వినియోగం దాదాపు అరవై శాతానికి పడిపోయింది. సాధారణ రోజుల్లో కంటే శని, ఆదివారాల్లో ఇరవై శాతం వినియోగం తక్కువ ఉంటుంది. ఈ ఆదివారం కర్ఫ్యూ కారణంగా మరో ఇరవై శాతం తక్కువ వినియోగం జరిగింది.
వివరాల్లోకి వెళితే...హైదరాబాద్‌లో సాధారణ రోజుల్లో రోజుకి 2500 మెగావాట్ల వరకు డిమాండ్ ఉంటుంది. శని, ఆదివారాల్లో 2100 మెగావాట్ల డిమాండ్ ఉంటుంది. అంటే 20 శాతం తక్కువ. ఆదివారం జనతా కర్ఫ్యూ కారణంగా విద్యుత్ వినియోగం మరో 400 మెగావాట్లు తక్కువ జరిగింది. అంటే రోజు వినియోగం 1700 మెగావాట్లకు పడిపోయింది. జనం అంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఏసీలు, ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ వినియోగం పెరిగినా పరిశ్రమలు, కార్యాలయాలు, మాల్స్ తెరవలేదు. అత్యవసర సేవలందించే ఆసుపత్రులు తప్ప హోటళ్లు, ప్రజారవాణా మూతపడడం కారణంగా వినియోగం గణనీయంగా తగ్గింది.