AP DGP: రాత్రి 9 గంటల తర్వాత కూడా ప్రజలు బయటికి రారనే భావిస్తున్నాం: డీజీపీ గౌతమ్ సవాంగ్

AP DGP responds on Janata Curfew

  • మరో రెండ్రోజులు కర్ఫ్యూ పొడిగించాలని ప్రజలు కోరుతున్నారన్న డీజీపీ
  • సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చిందని వెల్లడి
  • విదేశాల నుంచి వచ్చినవారు సహకరించాలని హితవు

జనతా కర్ఫ్యూపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. కరోనాను కట్టడి చేసే కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న జనతా కర్ఫ్యూలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారని తెలిపారు. ఇవాళ రాత్రి 9 గంటల తర్వాత కూడా ప్రజలు బయటికి రారనే భావిస్తున్నామని చెప్పారు. మరో రెండ్రోజులు కర్ఫ్యూ పొడిగించాలని ప్రజలు కోరుతున్నారని వెల్లడించారు.  సీఎం జగన్ వద్ద జరిగిన సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చిందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ఇతర ఏజెన్సీలు, విభాగాలతో పోలీసులు కలిసి పనిచేస్తున్నారని డీజీపీ తెలిపారు.

కరోనా నివారణకు ప్రజల సహకారం కోరుతున్నామని అన్నారు. విదేశాల నుంచి వచ్చినవాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విదేశాల నుంచి ఇక్కడికి చేరుకున్నవాళ్లు తప్పనిసరిగా వైద్యశాఖకు సమాచారం అందించాలని, వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది సూచనల మేరకు ఇంట్లోనే ఐసోలేషన్ పాటించాలని హితవు పలికారు. వైద్యపరమైన సూచనలు పాటించకుంటే ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు అని గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. పైగా, ఆ సూచనలు పాటించకపోవడం చట్టరీత్యా నేరమని, ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లేలా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని తెలిపారు.

  • Loading...

More Telugu News