afghanistan: నిద్రిస్తున్న తోటి భద్రతా బలగాలపై ఆఫ్ఘన్ జవాన్ల కాల్పులు.. 24 మంది మృతి
- జాబుల్‌లోని ఖాలత్ సైనిక శిబిరంలో ఘటన
- మృతుల్లో 14 మంది సైనికులతో పాటు 10 మంది పోలీసులు
- తాలిబన్లతో సంబంధాలున్న జవాన్ల చర్య
నిద్రపోతున్న భద్రతా బలగాలపై కొందరు సహచర జవాన్లు కాల్పులు జరిపిన ఘటన ఆఫ్ఘనిస్థాన్ జాబుల్‌లోని ఖాలత్ సైనిక శిబిరంలో చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి చెందారని అధికారులు ఈ రోజు ప్రకటించారు. మృతుల్లో 14 మంది సైనికులతో పాటు 10 మంది పోలీసులు ఉన్నారని వివరించారు. అంతేగాక, మరో నలుగురు సైనికులు కనపడకుండా పోయినట్లు తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభావం అధికంగా ఉంటుంది. భద్రతా బలగాలపై దాడికి పాల్పడిన జవాన్లకు తాలిబన్లతో సంబంధం ఉందని అధికారులు అంటున్నారు. ఈ దాడి చేసిన అనంతరం వారు ఆయుధాలు, మందుగుండు సామగ్రితో రెండు ట్రక్కుల్లో పారిపోయారని చెబుతున్నారు. దీనిపై తాలిబన్లు ఇప్పటివరకు స్పందించలేదు.