Vellampalli Srinivasa Rao: ప్రజారోగ్యం మేరకు భక్తులు స్వచ్ఛందంగా ఆలయాలను దర్శించడం వాయిదా వేసుకోవాలి: ఏపీ మంత్రి వెల్లంపల్లి విజ్ఞప్తి
- ప్రజలు, భక్తులు ఆందోళన చెందవద్దు
- ప్రధాన ఆలయాలను మూసివేయట్లేదు
- భక్తులను మాత్రం అనుమతించడం లేదు
రాష్ట్రంలోని ఆలయాల పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తుల ప్రవేశాన్ని ఆపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ విషయమై అధికారులు, ఆగమ శాస్త్ర పండితులు, పూజారులతో చర్చించినట్టు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు, భక్తులు సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా ఆయన కోరారు. ప్రధాన దేవాలయాల్లో స్వామి వారికి, అమ్మ వార్లకు నిత్యం జరిగే నివేదనలు, సర్కారీ పూజలు యథావిధంగా జరుగుతాయని, అవకాశం మేరకు టీవీల ద్వారా ఆయా పూజాధికాలను ప్రసారం చేస్తామని చెప్పారు.
ప్రజారోగ్యం మేరకు భక్తులు స్వచ్ఛందంగా ఆలయాలను దర్శించడం వాయిదా వేసుకోవాలని, రాష్ట్రంలోని చిన్న దేవాలయాలు బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే గ్రామ ఉత్సవాలు, జాతర్లను అనుమతించడం లేదని చెప్పారు. సంప్రదాయం మేరకు ఆలయ ప్రాంగణంలోనే ఆయా ఉత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు. పై నిబంధనలన్నీ ఈనెల 31వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు.
‘కరోనా’ వైరస్ వ్యాప్తి నిరోధానికి లోక కల్యాణార్థం అన్ని దేవాలయాల్లో మహా మృత్యుంజయ , సీత లాంబ , భాస్కర ప్రశస్తి, ధన్వంతరి హోమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి, ఉత్తరపీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సూచనల మేరకు అనారోగ్య నివారణా జప హోమాదులు, పారాయణలు నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు.