CPI Ramakrishna: చంద్రబాబు హయాంలో రమేశ్ కుమార్ ప్రాధాన్యత లేని పోస్టులో ఉన్నారు: సీపీఐ రామకృష్ణ
- ఎస్ఈసీకి కులం ఆపాదిస్తున్నారన్న రామకృష్ణ
- చంద్రబాబుతో రమేశ్ కుమార్ కు బంధుత్వం ఉందని ఆరోపిస్తున్నారని వెల్లడి
- వైసీపీ చర్యలే తమకు స్క్రిప్టు అని వ్యాఖ్యలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు కులం ఆపాదించి నోటికివచ్చినట్టు మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుతో రమేశ్ కుమార్ కు బంధుత్వం ఉందని ఆరోపిస్తున్నారని, కానీ చంద్రబాబు హయాంలో రమేశ్ కుమార్ పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టులో ఉన్నారన్న విషయం గుర్తెరగాలని హితవు పలికారు.
సీఎంకు సలహాలు సూచనలు ఇచ్చే సలహాదారులు, ఐఏఎస్ అధికారులకు ఈ విషయం తెలుసని, అయితే వాళ్లు సీఎంకు సరైన సలహా ఇచ్చివుంటే జగన్ ఇంత దిగజారి మాట్లాడి ఉండేవారు కాదని అన్నారు. ఈ విషయంలో తామేదైనా మాట్లాడితే టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్టును చదివి వినిపిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారని, వైసీపీ పాల్పడుతోన్న చర్యలే తమకు స్క్రిప్టు అని రామకృష్ణ స్పష్టం చేశారు.