Corona Virus: ఇంతకీ.. కరోనా నిర్ధారణ పరీక్షకు ఖర్చెంతంటే..!
- ఒక్కో వ్యక్తి కోసం రూ. 5000 ఖర్చు చేస్తున్న ప్రభుత్వం
- ప్రాథమిక టెస్టుకు రూ.1500.. నిర్ధారణ పరీక్షకు రూ. 3500
- ఇప్పటిదాకా ప్రభుత్వ అసుపత్రులు, ల్యాబ్‌ల్లోనే టెస్టులు
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మన దేశంలోనూ విజృంభిస్తోంది. భారత్‌లో కరోనా సోకిన వారి సంఖ్య రెండొందలకు చేరింది. ఇప్పటికే వేలాది మందికి వైరస్ పరీక్షలు చేశారు. కేంద్రం, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా అనుమానితులకు ఉచితంగానే వైద్య పరీక్షలు చేయిస్తున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షకు ఒక్కో వ్యక్తికి రూ. 4500 నుంచి 5000 వేలు ఖర్చు చేస్తున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకారం కరోనా వైరస్ ప్రాథమిక పరీక్షకు రూ. 1500, అనంతరం నిర్ధారణ పరీక్షకు రూ. 3500 ఖర్చు అవుతాయి.
కరోనా పరీక్షలకు అవసరమైన అత్యాధునిక పరిజ్ఞానాన్ని మన దేశంలోని ల్యాబ్‌లు జర్మనీ, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని దేశ వ్యాప్తంగా డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న ‘ట్రివిట్రాన్ న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్’ చైర్మన్ జీఎస్‌కే వేలు తెలిపారు. అందుకే ఒక్కో కరోనా నిర్ధారణ పరీక్షకు రూ. ఐదు వేల వరకూ అవుతోందని చెప్పారు. అయితే, ఈ పరిజ్ఞానాన్ని మన దేశంలోనే అభివృద్ధి చేసుకున్నట్లయితే పరీక్ష ఖర్చు రూ. 500లకు మించబోదన్నారు.
దేశంలో ఇప్పటిదాకా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వ అసుపత్రులు, ప్రభుత్వ ల్యాబ్‌లే నిర్వహిస్తున్నాయి. ఇకపై ప్రైవేటు అసుపత్రులు కూడా ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహించాలని భారత వైద్య పరిశోధన మండలి పిలుపునిచ్చింది. అయితే, దేశంలో వందలోపు ప్రైవేటు ల్యాబ్‌లకే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందని జీఎస్‌కే వేలు తెలిపారు.