Peddireddi Ramachandra Reddy: ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు: మంత్రి పెద్దిరెడ్డి
- రాష్ట్ర ఎన్నికల సంఘం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది
- ఫ్రాన్స్ లో కరోనా మరణాలు ఉన్నా అక్కడ ఎన్నికలు జరిగాయి
- నిమ్మగడ్డ రమేశ్ నిబద్ధత లేని అధికారి
రాష్ట్ర ఎన్నికల సంఘం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. రూ. 3 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రం అల్లాడుతోందని... ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుని టీడీపీ అధినేత చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ఏదైనా తప్పు చేయాలనుకున్నప్పుడు దానికి అవసరమైన రంగం సిద్ధం చేసుకోవడం చంద్రబాబుకు ముందు నుంచి ఉన్న అలవాటేనని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ తో కలిసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నారని అన్నారు.
ఫ్రాన్స్ లో కరోనా మరణాలు చోటుచేసుకున్నా... అక్కడ ఎన్నికలు జరిగాయని పెద్దిరెడ్డి చెప్పారు. ఏపీలో కూడా కరోనా తీవ్రత త్వరలోనే ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ నిబద్ధత లేని అధికారని... ఆయన ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు.