MRNA-1273: కరోనా వ్యాక్సిన్ పేరు ఎంఆర్ఎన్ఏ-1273... దాదాపు 10 దేశాల్లో ట్రయల్స్!
- టీకాను కనుగొనేందుకు విస్తృత ప్రయత్నాలు
- యూఎస్ లో 45 మందిపై ప్రయోగాలు
- వారి ఆరోగ్య పరిస్థితిపై అనుక్షణం పరిశోధన
ప్రపంచ మహమ్మారి కరోనాకు టీకాను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా భారత్, అమెరికా సహా 10 దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ వైరస్ సోకిన, సోకని వారిలో ఎంపిక చేసిన యువతీ యువకులకు వ్యాక్సిన్ ను ఎక్కిస్తున్నారు. వీటి ఫలితాలను అనుసరించే ఎంతకాలంలోగా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్న విషయం తేలుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇక ఈ వ్యాక్సిన్ కు సైంటిస్టులు 'ఎంఆర్ఎన్ఏ-1273' (మెసింజర్ రైబోన్యూక్లిక్ యాసిడ్ - 1273) అని పేరు పెట్టారు. అమెరికాలో 45 మందికి ఈ వ్యాక్సిన్ ను ఇప్పటికే ఎక్కించి, వారి ఆరోగ్య స్థితిగతులను అనుక్షణం గమనిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ఎక్కించుకుంటే, ఎటువంటి ప్రాణాపాయమూ ఉండదని, కొంత శ్వాస సమస్యలు, జలుబు మాత్రం రావచ్చని అంటున్నారు.
ఇక వ్యాక్సిన్ అభివృద్ధిలో చైనా, యూఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, ఇజ్రాయెల్ తదితర దేశాలు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ పని చేస్తుందని నిర్ధారించినా, అది పూర్తి స్థాయిలో ప్రపంచానికి అందుబాటులోకి వచ్చేందుకు ఒక సంవత్సరం నుంచి 18 నెలల వరకూ సమయం పడుతుందని అంచనా.