Telugudesam headquarters: టీడీపీ కేంద్ర కార్యాలయంలో కరోనా స్క్రీనింగ్ ఏర్పాటు
- కరోనా నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్ అప్రమత్తం
- నేడు కార్యాలయానికి వచ్చిన అధినేత చంద్రబాబు, ఇతరులకు స్క్రీనింగ్
- అత్యవసరం ఉంటే తప్ప జిల్లాల నుంచి ఎన్టీఆర్ భవన్‌కు రావొద్దని కార్యకర్తలకు సూచన
వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రంతోపాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. విద్యాసంస్థలు, సినిమా హాళ్లను మూసివేసి ప్రజలు ఒక్క చోట గుమిగూడకుండా చూస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అమరావతిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీ కార్యాలయంలో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. కార్యాలయంలోకి వచ్చే అందరినీ స్క్రీనింగ్ నిర్వహించాకే లోనికి అనుమతిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం కార్యాలయానికి వచ్చిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, చినరాజప్ప తదితరులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు.
కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి పార్టీ అధినేత చంద్రబాబు వివరించారు. ఇక, శరీర ఉష్ణోగ్రత వంద డిగ్రీల కంటే ఎక్కువ ఉండే వారిని లోనికి అనుతించకూడదని ఎన్టీఆర్ భవన్ నిర్ణయించింది. అలాగే, అత్యవసర పని ఉంటే తప్ప జిల్లాల నుంచి కేంద్ర కార్యాలయానికి రావొద్దని కార్యకర్తలు, నాయకులకు సూచించింది.