Tirumala: వెంకన్న దర్శనం గంటలోనే... శాశ్వతంగా ఇదే విధానం కావాలంటున్న భక్తులు!

Only One Hour for Darshan in Tirumala
  • టైమ్ స్లాట్ టోకెన్ ద్వారా మాత్రమే దర్శనం
  • కరోనా వైరస్ వ్యాపించకుండా చర్యలు
  • నిన్నటి నుంచే సమయాన్ని కేటాయిస్తున్న టీటీడీ
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్, నిత్యమూ లక్షలాది మంది వచ్చిపోతుండే తిరుమలలో వ్యాపించకుండా టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయం ఈ ఉదయం నుంచి అమలులోకి వచ్చింది. ఈ తెల్లవారుజాము నుంచి కేవలం టైమ్ స్లాట్‌ టోకెన్ల విధానం ద్వారానే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఇందుకోసం నిన్న సాయంత్రం నుంచే కొండకు వచ్చే భక్తులకు సమయాన్ని కేటాయిస్తున్నారు.

కరోనా భయాందోళన తొలగే వరకూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్టు ఇప్పటికే టీటీడీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. భక్తులకు సమయాన్ని కేటాయించేందుకు తిరుపతిలోని పలు ప్రాంతాలతో పాటు, తిరుమలలోనూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. గంటకు 4 వేల మందికి పైగా భక్తులకు దర్శనం కలిగించే ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.

కాగా, నిన్న స్వామివారిని 55,827 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 17,339 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 2.06 కోట్ల ఆదాయం లభించింది. ఇక ఈ ఉదయం టైమ్ స్లాట్ టోకెన్ ద్వారా దర్శనం చేసుకుని వచ్చిన భక్తులు, ఈ విధానం చాలా బాగుందని, ఇకపై వచ్చిన వారికి వచ్చినట్టు టైమ్ కేటాయిస్తూ, ఇదే విధానాన్ని శాశ్వతంగా అమలు చేయాలని కోరుతున్నారు.
Tirumala
TTD
Tirupati
Piligrims

More Telugu News